నా కవితలు (2025 నుంచి)
*అభిమానులం*
మేము అభిమానులం
మా హీరోస్ ని,
మా కుటుంబ సభ్యులకన్నా
అధికంగా అభిమానాస్తాం,
ప్రేమిస్తాం
కావాలంటే మా ప్రాణాలిచ్చేస్తాం
అంతేగాని
తగ్గేదెలేదంటాం
ప్రాణాలకు తెగించి లేదా
ప్రాణాలను అర్పించి
ప్రాణాలను అర్పించి
తీవ్రవాదులను మట్టుబెట్టిన
నిజమైన హీరోలైన
ముకుంద్ వరదరాజన్,
మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్
లాంటి వీరులకు,
లేదా
మంగళయాన్, చంద్రయాన్
వంటి, ప్రాజెక్టులను,
విజయవంతం చేసిన
శాస్త్రవేత్తలకు
మేము అభిమానులం కాము, కాలేము.
వీరంతా రియల్ హీరోలే,
కోట్లతీసుకోకుండా,
కేవలం
వేతనం తీసుకొని,
దేశంకోసం పాటుబడిన
గొప్పవీరులే వీరు.
అయినా మేము వీరికి
మేము అభిమానులం కాము, కాలేము.
ఎందుకంటే వాల్లవి
అన్నీ బోరింగు స్టోరిస్
అదే ఒక్కడు,
300 కోట్లు తీసుకొని
తాళ్లు కట్టుకుని,
వంద మంది
మహాబలశాలులను,
ఎగిరెగిరి తన్నుతూ,
కొడుతూ వుంటే,
ఆ మహాబలశాలు
కొట్టగలగికూడ
దెబ్బలు తింటు వుంటె
వేలు ఖర్చుపెట్టి,
టికెట్లు కొని
ఆ అబద్ధాన్ని చూసి,
మనం ఆనందించుతాం.
ఈ రీల్ హీరోలు,
ఈ fake హీరోలే
అయినా వారే
మాకు స్పూర్తి
ఈ fake హీరోగాల్లకు
మన భాష రాదు
ఏ పరాయి భాషవాడో
తెలుగు ఖూనీ చేస్తూ
గాత్రం సంస్కారం లేకున్నా
పాడిన పాటలకు
ఎగెరెగిరి గెంతుతారు.
అది వ్యాయామమో,
సర్కస్, డాన్సో అర్థం కాదు
ఇలా మన భాష పైన
గౌరవంలేని,
fake హీరోల
సినిమాలకు,
మనం వేలు
ఖర్చుపెట్టి
వారు
సమాజానికి,
మరింత చెడు చేసేలా,
మనం మరింత తోడ్పుతున్నాం.
So,
రియల్ హీరోల కన్నా
రీల్ హీరోలకే
మనం పిచ్చ
అభిమానులం.
ఎందుకంటే
అబద్ధం అందంగా
వుంటుంది
కాబట్టి
**************
*Calender మారితే*
----------------------
గతం జ్ఞాపకం
భవితవ్యం స్వప్నం
జ్ఞాపకాల, స్వప్నాల
నడుమ సాగేది
మన జీవితం
జ్ఞాపకాల పునాదులపై
స్వప్నాల భవనాలు
నిర్మించుకోవాలి
అయితే..గతంలో
మంచి పనులు
మంచి విషయాలు
మంచి ఆలోచనలు
మంచి భావాలు
పోగు చేసుకొనిన
భవిషత్తు అనే భవనం
పటిష్టంగా వుంటుంది
పాత తలపోతలు
పాత అలవాట్లు
పాత బలహీనతలు
అన్నీ మోసుకొని
నూతన వర్షంలో
అడుగిడితే
పాత మనిషిగానె
మిగిలిపోతాం
పబ్బు Time
మబ్బు Time
పబ్బం Time
అయిపోయాయి
కావున...
బద్దకాన్ని బద్దలు కొట్టి
అల్పత్వం, అనిశ్చితిని విడిచి
అహ్లాదం, అనందమును వరించి
ముందుకు సాగాలి
పనులు వాయిదా వేయడం
అంటే
అందుకోలేని రైలు వంటిది.
దానివల్ల ఎంచుకొన్న
కొత్త లక్ష్యాలు, కొత్త గమ్యాలు
చేరుకోవడం అవుతుంది దుర్లభం.
యోచించకు గతంలో చేసిన పుణ్యం
పెంచుకో నిత్యం కొత్త నైపుణ్యం
కావున..
క్రొత్త పరిజ్ఞానం,
క్రొత్త సాంకేతికత(AI)ను
అలవరచుకొంటూ
కొత్త సంవత్సారానికి
కొత్త తరానికి తగిన
కొత్తమనిషిగా మారి
ముందుకెళ్ళదాం
నేడు పొందె ఆనందం
పరిమితిలో వుంచుకొందాం
రేపటి ఆనందాన్ని
హారించకుండ చూసుకొందాం
సమయాన్ని
కొంత సంపాదన కోసం
కొంత కుటుంబం కోసం
కొంత దేహం కోసం
కొంత సమాజం కోసం
కేటాయిద్దాం
అలా కాకున్నా.. కేవలం
calender మారుతుంది
wonders ఏమి జరగవు
తేది మారుతుంది
మరేది మారదు
==============
==============
*భోగి పండుగ*
*************
మన దేశంలో
భోగి మంటలు
వేసుకొంటున్నాం
కాలిపోర్నియాలో మంటలు
ఊర్లను కాల్చివేస్తున్నవి
మనసులు కలిచివేస్తున్నవి
ఖరీదైన కారులు
పేదవాడి గృహాలు
అని ఎగిసె మంటకి తెలియదు
పంచభూతాలకు
అందరు సమానమే.
అయితే..
పనికిరాని వస్తువులను
పోగేసి, నిప్పు రాజేసి
మంట పెట్టడం కాదు
భోగి ఉద్దేశం
మన ప్రగతికి
ఉపయోగపడని
రాగద్వేషాలను
కసి, అసూయలను
భావదారిద్రములను,
బలహీనతలను
తగలపెట్టడమే
ఈ భోగిమంట
పరమార్థం
మంట వంట
చేసుకొనేందుకు
ఉపయోగపడితే
మనిషికి ప్రశాంతం
అంతకు మించిన మంట
చూస్తూంది మనిషి అంతం
అందువలన మనం
నేడు చెడును
తగలబెట్టుదాం
మంచిని ప్రేమిద్దాం
అందుకొరకు శ్రమిద్దాం
**సంక్రాంతి శుభకాంక్షలు 2025**
***********************
మంచుకు తడిసిన
ముద్ద బంతిపువ్వులు,
చుక్కలు లెక్కపెట్టి
చక్కని గీతలు గీసి
మక్కువగ, ముచ్చటగా
ముగ్ధలు వేసిన ముగ్గులు,
అ ముగ్గులలో, రంగులు
వేయగా వచ్చిన
కొత్త హంగులు,
మధ్యలో కొలువు తీరిన
బంగారు గొబ్బెమ్మలు,
పడుతులు చుట్టు చేరి
పాడె గొబ్బిళ్ళ పాటలు
గడపలకు పసుపుకుంకుమల
పారాణిలు,
ద్వారాలకు పూలాహారాలు,
మావిడాకుల తోరణాలు,
అన్నియు కలిపి
సంక్రాంతి గృహాలకు
అమరే ఆభరణాలు
ఎంకి పాటలు వింటూ
పండిన వరి కంకులు
ధాన్యమై ఇల్లు చేరిన వేళ,
గరిసెలలో ధాన్యపు గలగలలు
వంటగదిలో అరిసెల ఘుమఘుమలు
వార్డు రోబ్‌లో చుడిదార్లు,
జీన్స్ ప్యాంట్స్ వల్ల
వెనకు నెట్టబడిన
పట్టుచీరలను, ఇంతులు
కట్టుకొనగా, పట్టరాని
ఆనందంతో మురిసెపోయె
ఆ పట్టుచీరలు
మగవారి ధరించగా
మెరిసిపోయె పట్టుపంచెలు
అయితే..
బంగారు గనులున్నా
ఖరీదైన మణులున్నా
అందరు తినేది అన్నమే
త్రాగేది గోవు పాలే
అలా తిండి గింజలు
పండించి మనకందించె
హాలికులకు,
పాలిచ్చె గోవులకు,
వ్యవసాయంలో
సాయం చేసిన ఎద్దులకు,
మనం ధన్యవాదములు
(Indian Thanks giving)
తెలుపుకొనె పండుగ
అలా..
ఇది ప్రకృతి పండుగ
పశువుల పండుగ
రైతుల పండుగ
పల్లెల పండుగ
కుటుంబాల పండుగ
* శివుడు - నిరాడంబరుడు*
ఆడంబరంలు
అలంకరణలు
ఆభరణంలు
తనకి తగవని
తెలిపె శంకరా!!
శివ శంకరా!!
శంభో శంకరా!!
సోలర్ లాంప్‌గా
వంకర శశిని
సిగలో తురుముకొనగ
మీకు కరెంటు అవసరమేది?
బిరబిర పరుగిడు గంగమ్మను
గట్టిగా పట్టుకొని
జుట్టులో కట్టుకొనగా
మీకు వాటర్ ఫ్రాబ్లమేది?
పడగవిప్పి ఆడే నాగులను
మెడలో నగలుగా
దిగవేసుకొనగా
మీకు వేరె హారములు దేనికి?
మందమైన కరిచర్మమును
లేదా
పులిచర్మమును ధరించె మీకు
జీన్సు ప్యాంట్స్ దేనికి?
దేహం నిండుగా
భస్మము పులుముకొనె మీకు
మాయిస్‌రైజ్ క్రీములు
ఫెర్ అండ్ లవులీలు
పాండ్స్ పౌడరుల
అవసరం ఏమున్నది?
భువనములనేలే మీకు
స్మశానమే నివాసంకాగా
మీకు ఖరీదైన
భవనములు దేనికి?
ముల్లోకంలు తిప్పగల
నమ్మకమైనా వాహనం
నంది మీకుండగా
BMW, BENZ లాంటి
వాహనముల మీకు
అవసరమా?
శివా!! సదా శివా!!
మీ జీవన విధానం
సాధరణం యని తెలిపినా,
మేము పైన చెప్పిన
విషయవాంచల కొరకే
పరుగిడుతాం
అయినను మేము
మీ సుతులం, సుతలం
కావునా..
ఓ భక్త వల్లభా!!
సులభ ప్రసన్నా!!
ఆలకించు మా మొరలను
కురిపించు మీ కరుణను
=========================
=========================
*ఓం నమ: శివాయా*
*****************
సాలీడు వలె నీచుట్టు
గూడు నిర్మించలేను
పణీంద్రుని వలె నీకు
మణులను పొదగలేను
కరిరాజు వలె నీకు
తోయం(నీరు)తో
అభిషేకం చెయ్యలేను
కన్నప్ప వలె మీకు
నా కన్నులు అమర్చలేను
మార్ఖండేయుని వలె
తీవ్రమైన భక్తితో
మార్కులు కొట్టయ్యలేను
రావణబ్రహ్మా వలె
భీతికొల్పు రీతి
రుద్రవీణ వాయించలేను,
శివతాండవ శ్తోత్రం
విరచించలేను, పాడలేను
నందీశ్వరుని వలె
వాహనం కాలేను
నిరంతరం నిన్నే
కాస్తు వుండలేను
శ్రీ ఆది శంకరాచార్య గారి
వేల శ్తోత్రములు వ్రాయలేను
మిమ్మలిని మెప్పించలేను
పై వారంతా
అచంచల విశ్వాసంతో
అకుంఠిత దీక్షతో
అనంతమైన భక్తితో
మిమ్మలిని కొలిచినారు
మీ అనుగ్రహం పొందినారు
అయితే నేను..
ఏ క్రతువులు
ఏ వ్రతములు
ఏ మంత్రములు
ఏ తంత్రములు
ఎరుగని వాడిని
రుద్రం
నమకం
చమకం
పఠించలేని వాడిని
శ్తోత్రములు
శ్లోకములు
వల్లించలేనివాడిని
ఏ తీరుగా కొలవాలో
ఏ పేరుతో పిలవాలో
తెలియనివాడిని
అయితే..
ఒక మారేడు దళముకే
బిల్వ పత్రానికే
చిటెకెడు విభూతికె
చెంబుడు నీళ్ళకె
సంతసపడె
మా సాంబడివని
సులభ ప్రసన్నుడివని
భోళ శంకరుడివని
ఎరిగి
మనసున నిన్నే తలచుకొనుచు
భక్తితో కొలుచుకొనుచు
శివా శివాయని పిలుచుకొనుచు
వేడుకొనె నేను
మాన్యుడిని కాను
సామాన్యుడిని,
గొప్ప ఋషిని కాను
సాధరణ మనిషిని
మీ పాదముల తలనిడి
కనుల నీరిడి
కరుణించమని
వేడుకొనె మీ భక్తుడిని.
ఓం నమ: శివాయా!!
=====================
* ఆందోళన *
***********
రావలిసిన ర్యాంకులు
కోరుకున్న కాలేజి సీటులు
చదువుకు తగిన పదవులు
సాయం మరచిన మిత్రులు
వలచి విడిచిన ప్రియురాలు
ప్రేమించి ముంచిన మోసగాడు
నడిరాత్రి కారడివిలో
ఆగిపోయిన కారు,
రిపేరు కొరకు
పరాయి దేశంలో
నిలచిపోయిన విమానం
శ్రమకు తగిన గుర్తింపులు
యోగ్యతకు తగిన మర్యాదలు
పెరిగె వయస్సు, ఖర్చులు, వెతలు
పెరగని వేతానాలు,
చిరాకు పెట్టె కుటుంబ పరిస్థితులు
పరాకు కలిగించె అనారోగ్య స్థితులు
ఇలా ఎదో ఒక సందర్భం
మనలిని ఇబ్భంది
పెడుతూనే వుంటుంది
అప్పుడు మనమెంత
ఆందోళనకు
ఆవేదనకు
ఉద్విగ్నతకు
గురవుతామో
అది, మన మనస్సు పైన
మనకు వున్న
నియంత్రణ బట్టి వుంటుంది
అయితే.. కొంతమంది
ఉరిని వరిస్తారు
విషమును హరిస్తారు
మద్యం సేవిస్తారు
depression కు గురవుతారు
family ని destruct చేస్తారు.
ఇప్పుడు..కొంచెం
Sunita Williams
మరియు Wilmore
గురించి ఆలొచిద్దామా..
తొమ్మిది రోజులని,
పరలోకానికి (space) పంపినపుడు,
ప్రతికూల పరిస్థితుల వలన
దిక్కు తెలియక
పలకరించె ఆత్మీయులు లేక
భుజం తట్టే స్నేహితులు లేక
వారు అక్కడ ఆగిపోయినపుడు
మూడు నెలలలో, అయిపోయిన fruits
మూడుపూటల లేని రుచికరమైన పదార్థాలు,
పదే పదే reheat చేసుకొని తిన్న food
recycle చేసుకొని త్రాగిన నీరు
బరువు తగ్గకుండ వుండాలంటే,
రెండు లేదా మూడు గంటలు వ్యాయమం
ఎప్పుడు నిద్ర పడుతుందో తెలియదు
ఆకాశంలో నివాసం
చుక్కలతో సహవాసం
రాజకీయాల,
నాటకీయాలు వల్ల
తిరిగి ఇల్లు చేరుతామో లేదొ
తెలియని స్థితి
అప్పుడు.. వారు
ఎటువంటి మానసిక దృఢత్వంతో
గడిపివుంటారో ఊహించగలమా?
మనకొచ్చిన సమస్యలు
ఇంతకు మించినవా?
ఒక పసిపాప, నవమాసంల తరువాత
తల్లి గర్భం నుండి వచ్చినట్లు,
తొమ్మిది నెలల తరువాత
సునీత మరియు Wilmore
పుడమిపై ఆడుగిడుతూ
చెరగని చిరునవ్వుతో
చెయ్యి వూపినపుడు,
జగతిలో చెమరని
కళ్ళను వూహించగలమా?
మనం ఇప్పుడు అటువంటి
మానసిక స్థైర్యం ను
గుండె ధైర్యం ను
ఆత్మ నిబ్బరం ను
ఎలా పెంచుకోవాలో
మన పిల్లలతో
ఎలా పంచుకోవాలో
ఆలోచిద్దామా?
========================
* ఉగాది 2025*
రంగుల రాట్నం గిరగిర
తిరిగినట్లు,
దినములు బిర బిర తిరిగి
ఉర్కుంటూ వచ్చె
మరో నూతన తెలుగు వర్షం
అందువలన..
ద్వారములకు
బంతిపూల హారములు,
పసుపు కుంకుమల
అలంకరణములు,
మావిడి తోరణములు,
అలా, గుమ్మాలకు వొదిగె
చక్కని ఆభరణములు
లిప్‌స్టిక్ వేసుకొనెందుకు
సమయంలేని వనితలు,
ఇంటి ముందు అతికించిరి
ప్లాస్టిక్ ముగ్గులు
షడ్రుచుల భోజనములు
సంప్రదాయ వస్త్రధారణములు
చేనేత, కాటన్ చీరలు
ఎంబ్రాయిడరి సొగసులు
టెంపుల్ లేదా టెర్రకోట
జ్యువెలరీలు,
అలా, ఎటు చూసిన
అందరిలో ఉత్సాహమ్ను
ఉత్తేజమ్ను నింపింది
మన ఉగాది
అయితే..
ఒక ఉద్యోగి, రాబోయే
ఆర్థిక సంవత్సరానికి,
సాధించవలసిన, goals
వ్రాసుకొన్నట్లు
ప్రతి ఒక్కరు
ప్రతి ఉగాదికి
సాధించవలసిన
కొత్త ఆశయాల జాబితా
వ్రాసుకొంటాము
మరి చివరిలో
ఏమి సాధించామో
బేరీజు వేసుకొంటున్నామా?
కష్టం, నష్టం
సుఖం, దు:ఖం
తీపి, చేదు
ఇవి జీవితంలో
సాధరణమని
తెలిపె తత్వమే
మన ఉగాది పచ్చడి
యొక్క గొప్పతనం
అయితే..
యెన్నో ఏళ్ళుగా
ఉగాది పచ్చడిని
సేవిస్తున్న మనం
ఎంతవరకు, మన
ఉద్వేగాలను
ఉద్రేకాలను
నియంత్రించుకొన్నామో?
కమ్మే చీకట్లనీ
చిమ్మే వెలుగులనీ
నిజంగానె
సమదర్శనం చేశామో?
ఉగాది, ఉగాదికి
ఎంత ఉన్నతంగా
ఆలోచిస్తున్నామో?
మానసికంగా ఏమి
పరిణితి చెందినామో?
మంచిని పెంచుకొని
ఎందరికి పంచుతున్నామో
ఎప్పుడైనా
బేరీజు వేసుకొన్నామా?
బేరీజు వేసుకోక పోతే
ప్రతియేడు, ఉగాది
జరుపు కోవడంలో
అర్థముందా?
నూతన అదృష్టాని
ఇస్తానని
కొత్త సంవత్సరం
భరోసా ఇవ్వదు
పంచాంగం ప్రకారం
గ్రహములు, చక్కని గృహములలో
అమరినవో, లేవో,
అదాయం, వ్యయం
రాజపూజ్యం, అవమానం
అధికమో, అల్పమో
యనె, విషయాలు విని
అటు పొంగిపోకుండ
ఇటు కృంగిపోకుండ
అవి దిక్సూచిగా,
చక్కని సూచికగా
జీవితంలో భావించి
ఆచితూచి, అడుగులు
వేసుకొంటు గెలవమనె
గాని..
కళ్ళు మూసుకొని
కాళ్ళూచేతులూ ముడుచుకొని
మంచికాలం ముందుందని
కాలయాపన చెయ్యమని కాదు
ఏమరుపాటుగా ఉంటే
తప్పదు నీకు నివ్వెరపాటు
కావున..
కష్టపడితే పోయేదేముంది
బ్రదర్ అనుకొని,
ఒక్కసారి కాదు
వందసార్లైన కష్టపడటాన్ని
ఇష్టపడుతూ
బద్ధకాన్ని
బద్దలు కొట్టెయ్
భ్రమలు తొలిగించేయ్
శ్రమను ప్రేమించేయ్
గేలి చేసిన చోట
చూపించు గెలిచి నీ ఆట
చదువును నమ్ముకున్నవాడు
కష్టమును ఇష్టపడినవాడు
ఓడిపోయినట్లు, చరిత్రలోనే లేదు
పాత భయాలు పారిపోనీ
క్రొత్త జయాలు తరలిరానీ
అలా.. ఈ విశ్వావసు
ఈ విశ్వములో, అందరు
ప్రేమ అప్యాయతలతో
పలకరించేలా
స్నేహ పరిమళములు
చిలకరించేలా
మంచినె యెంచెలా
మంచినె పంచెలా
అందరికి
శుభములు జరగాలని
ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ
డెందం నిండా ఆనందంతో
తెలుపుతున్నా నా ఈ
నూతన వర్ష శుభాకాంక్షలు
========================
* ఏమి మారింది *
పూర్వం
సామంత రాజులు
సార్వభౌములకు
కప్పం కట్టెవారు
అందుకొరకు
ప్రజలు పస్తులున్నా సరే
సామంత రాజులు
సిస్తు కట్టమనేవారు
ఆవిధంగా
సామంత రాజులు
సార్వభౌములు
ఇద్దరు క్షేమం,
కాని..
ప్రజలకు మిగిలింది
మాత్రం క్షామం
నేడు చక్కని వర్తమాన
ఆర్థిక వ్యవస్థ అమరికను,
తల్లక్రిందులు
చేస్తూంది అమెరికా
సార్వభౌములు
కప్పం కట్టమని
ఆదేశించిన తీరుగా
నేడు..
ఆగ్రరాజ్యం జాత్యహంకారంతో
అన్ని దేశాలపై వడ్డించింది
సుంకాల మోత
ఫలితంగా..
కుదేలైన మార్కెట్లు
ఊహించని ఇక్కట్లు
ఎటుచూసిన చీకట్లు
సలపలేని ఊపిరి
నిన్నటి సంపద
నేడు ఆవిరి
తన మాట వినని
దేశాలపై, వారి
వెన్ను విరిగెలా
మరిన్ని పన్నులు
ఇదంతా
ఆగ్రరాజ్య నేత
చేస్తున్న లోభం,
అది, ప్రపంచానికి
మిగిల్చెను
తీవ్ర సంక్షోభం
మౌనం వహిస్తున్న
విపక్ష డెమాక్రెటులు,
నోరెత్తని రిపబ్లికన్సు,
"హండ్సాప్ ట్రంప్"
యను, నినాదాలతో,
రోడ్డలపైన
సాధారణ ప్రజలు
ఎటుచూసిన కనబడని
ఆశారేఖలు,
అలుముకొన్న నిరాశలు,
నిస్పృహలు,
రేపు బాగుంటుందని
లేని భరోసా
యుగాలు మారిన
ఈ జగనా,
ఏమి మారింది
బలవంతుడు
బలహీనుని
వేధించె తీరు
మారలేదు
*జాతీయ పక్షుల దినోత్సవం*
************************
పక్షులు పలురకాలు
పెరటు పక్షులు
జననివాస పక్షులు
పొలం పక్షులు
అడవి పక్షులు
జలాశయాల పక్షులు
వలస పక్షులు
మనిషికి, పక్షులకు
మంచి అవినాభావ
సంబంధం వుంది.
ఒక పక్షి, పాట పాడి
వసంతం, చైత్రములు
వచ్చయాంటూ
ఉగాది పండుగ
జరుపుకోమంటుంది
ఇంకొక పక్షి
నాట్యమాడుతూ
వర్షఋతువు రాకను
తెలుపుతుంది
సొంత మనుషులు
మరణించినపుడు,
ఒకపక్షి బోజనము తిని
తమ బంధువే తినిన
ఆనందమును కలిగిస్తూంది
పక్షులు పండ్లను తిని
గింజలు వివిధ ప్రాంతాలలో
జల్లి, అడువుల విస్తరణకు
దోహదం చేస్తాయి.
పక్షులు, పంటలకు
పట్టిన పురుగును తిని
రైతులకు వ్యవసాయంలో
సాయం చేస్తాయి
ఒక పక్షి, జనానికి
అలారమై నిదురలేపి
అపైన ఫలహారమవుతుంది
ఎగిరె ఖగమును చూసి
గగనమున ఎగరాలని
మనిషి విమానమును
కనిపెట్టాడు
ఒకప్పుడు పిచ్చుకలు
మన ఇంట, పసిపిల్లలాగ
కిచు కిచు మంటూ వుండేవి.
సెల్‌టవర్స్, కాంక్రీట్ జంగల్
రేడియేషన్ దెబ్బకి
అవి మరుగైపోయాయి.
ఒకప్పుడు పావురంలు
ఉత్తరములను అందించేవి.
వాటిని వలలు వేసి
పట్టెవాళ్ళం.
ప్రస్తుతం వలలోపల
మనం వుంటున్నాం.
చెరువులు, ఊరులుగా
వనాలు, భవనాలుగా
మారగా, తరువులు
దొరకక, ఎన్నో పక్షులు
కనుమరుగైనాయి
అంతరించే పక్షులు,
తరిగె అడువులను
పెరిగె ఎడారులను
తెలుపుతూ,
మనిషికి భవిషత్తు
ఎంత కఠినంగా
వుంటుందో తెలుపుతున్నాయి.
వీలయితే
గుక్కెడు నీళ్ళను
గుప్పెడు గింజలను
మంజా దారాలులేని
ఆకాశాన్ని ఇచ్చి
పక్షులను
కాపాడుదామా!!
happy జాతీయ పక్షుల దినోత్సవం
* కాశ్మీరం*
***********
అందమైన లోయలు
హిమమైన కొండలు
గిలిగింత పట్టె చలి
ఉల్లాసపరిచే
వాతావరణం,
యోగులకు
తపో ఆవరణం
అందుకే, కాశ్మీరం
భూతల స్వర్గం
అలా రుద్రుడు
విహరించే ప్రకృతిలో,
కొందరు క్షుద్రులు,
దరిద్రులు,
వికృత చేష్టలు చేయగా
భూతల స్వర్గం కాస్త
భూతల నరకంగా
మారింది
కోసె కత్తికి
పేల్చే తుపాకి
మంచి చెడులు
తెలియదు.
కాని కాల్చే మనిషికి
విచక్షణ వుంది కదా!!
నువ్వు పవిత్ర యుద్ధ వీరుడివా!!
సిగ్గుమాలిన భీరుడివా
వీరుడు నెపుడు
నిరాయుధులని
నిస్సహాయులను
చంపడురా
పిచ్చివెదవా
నువ్వు చంపినవాళ్ళు
నీ డబ్బులు, ఆస్తులు
దోచుకోలేదు,
నిన్ను మోసం చెయ్యలేదు
నీ ఉద్యోగం తీయ్యలేదు
మరిదేనికి, దేనికిరా
ఈ దారుణ మరణాలు
ఒక పడతి కాళ్ళపారాణి
ఆరక మునుపే
మెడలో దారం
తెంచావు కదరా!!
తండ్రిని కోల్పోయి
తల్లడిల్లిన, పసిపిల్లవాడి
గోడు కనలేవరా
అడవి జంతువులకు కూడ
ఒక నీతి వుంటుందిరా,
ఆకలైతేనె కాని
అవి వేటాడి, వెంటాడి
చంపవు, తినవు
మరి మీ నీతి ఏమిటి?
అడగడుగునా
రక్తపు మడుగులు
చూసి ఆనందించావా
పారే రుధిరం (blood)
మధిర (మద్యం) త్రాగి
తరించవా
అయినా.. ఓరే
ప్యాంటు విప్పించి
ఏమి దర్శించావు రా!!
మోక్షం లభించినదా
పిరికివెదవా
మీకు
ఉన్మాదం
ఉగ్రవాదం కన్నా
మించిన
పేరు పెట్టాలి
ఎందుకంటే..
మా పురాణాలలో
మేము చదివిన
రాక్షసుల కన్నా
నీచులు, నికృష్టులు
మీరురా
నిజానికి, ఆ తరుణంలో
చనిపోయిన వారు,
ఒక క్షణమే భయపడి వుంటారు
కాని మిగిలిన వారిలో కలిగిన దిగులు
వర్ణించ గలమా!!
వచ్చినవాడు
రక్షకుడో, శిక్షకుడో
భక్షకుడో,
చస్తామో, వుంటామో
దిక్కు తెలియక, బిక్కు
మంటు కొన్ని గంటలు
వారు పడిన నరకం ఊహించగలమా!!
జీవితంలో
ఈ పీడకలను
మరచిపోగలరా
ప్రపంచం, AI వైపు
పరిగెడుతు వుంటే
నీ అడుగు, పరుగు
ఎటువైపో చూడరా
పిరికివెదవా,
పకీరు వెదవా!!
మరి మనం
సింధు నది ఒప్పందం
ఆపడం వలన,
ఆ రాబందులు
మన మదిలో కలిగిన
గాయాలకది
మందు అగునా
అంతేగా, అంతేగా
అనుకోకుండా,
అంతకు మించి
ఏమైనా జరగాలని
మనస్సు, మధన పడుతున్నది
** ప్రపంచ సైకిల్ దినం (world cycle day)**
****************************************
మనిషికి, మొదటి వాహనం
రెండు చక్రాల బండి
అదే.. మనకిష్టమైన సైకిల్
ఒకప్పుడు..
ర్యాలీ, హంబర్ సైకిల్లు
తొక్కెవారిని శ్రీమంతులుగాను,
హీరో సైకిలు వున్నవారిని
మధ్యతరగతి వారుగాను,
అట్లాస్ గలిగినవారిని
లోక్లాస్ వారుగాను
పరిగణించెవారు
రాత్రి పూట, వెనుక టైర్‌ను
రాసుకొంటు, డైనమో నుండి
వచ్చే వెలుగు గాని,
కిక్కిరిసిన జనాలలో
ట్రింగ్ ట్రింగ్ మంటూ,
బెల్లు కొట్టడంలోగాని
ఎంత మాజా వుండెదో
పెళ్ళైనవాడు భార్యను
సైకిలుకి ముందున్న,
ఐరన్ బారు పైన
కుర్చొపెట్టుకొని,
తన బాహువుల మధ్య బంధించి
మల్లెలుపూలు ముక్కుపుటాలను
తాకుతు వుంటె, అలా సినిమాకి
తీసుకెళ్ళడంలో కలిగే అనుభూతి,
ఏ బెంజికారులో దొరుకుతుంది మనకు.
ఈ రోజుల్లో కారుల్లున్న వాడికన్నా
ఆ రోజుల్లో సైకిలున్న వాడినె
గొప్పగా చూసెవారు
కొంచెం ప్యాషన్ తెలిసిన వారు
సైకిల్‌ను గొప్పగా అలంకరించెవారు
హండిలుకి రెండు అద్దాలు,
బుక్స్ పెట్టుకొనె హొల్దెర్
సీటుకి స్పాంజ్ కవర్,
పిల్లల కొరకు చిన్న సీటు,
రిమ్స్‌కి రంగు రంగుల పూసలు,
అలాగే స్పోక్స్ మధ్య,
ఇంధ్రధనస్సు రంగులను బోలు కుచ్చులు,
చైనుకు వేసిన కవర్ పైన వ్రాసుకొన్న పేరు
అలా ఎన్నో అలంకరణలు
ముఖ్యంగా, సైకిల్ మనిషికి
జీవిత తత్వాన్ని తెలుపుతుంది.
రెండు చక్రాలు ఒకే వైపు,
ఒకే వడిలో(speed) పయనించి
గమ్యం చేరినట్లు
ఆలుమగలు జీవనం సాగించాలని,
smooth travel కొరకు
చైనుకు oil పోసినట్లు
సంసారంలో అనురాగమనె
తేనెలు అవసరమని,
గాలికి ఎదురొడ్డి త్రొక్కినప్పుడు,
వెనుక కురొచ్చొన్న మిత్రుడు కూడా
పెడల్ పైన కాలు వేసి తొక్కె విధానం
ఒక team workను తెలుపుతుందని.
అలాగే పల్లంలోకి దొర్లేటప్పుడు
మితిమీరిన వేగమును, నిరోధించాడానికి
బ్రేకులు వాడినట్లు, మనిషి కూడా
కోరికలను అదుపు
చేసుకోవాలని తెలుపుతుంది.
సైకిల్ తొక్కడానికి కావలసింది
బ్యాలెన్స్ చేయడం,
ఆ బ్యాలెన్సే జీవితానికి కూడా
అవసరమని తెలుపుతుంది
నిజానికి సైకిల్
కేవలం టైరులో గాలి,
చైనుకు, చక్రాలకు
కొంచెం నూనె తప్ప
మరే ఖరీదైన
ఖర్చులు పెట్టించదు
అది simplicityని తెలుపుతుంది
అలాంటి మన సైకిల్
ఇంటి ముందు
నమ్మకమైన బంటులా
మనకోసం వేచియుంటుంది
ఇక..
ఈ కృష్టుడి మాటలు
అర్థవంతమైనవైనను,
అర్థవంతమైనవి కాకున్నను
మీ సందేశములను ఇవ్వగలరు.
* తెలంగాణ *
పన్నెండు వందల మంది
ఆత్మ బలిదానాలు,
వందల మంది విప్లవకారుల
ఆరాటం, పోరాటం
చెలగాటం
సకలజనుల సమ్మె
మిలినీయం మార్చ్
సాగహారాలా
ఉద్యమాల
ఫలితమే
తెలంగాణ
అవతరణ
మేమే తెలంగాణ
తెచ్చామని కొందరు
పాలకులు,
మేమే తెలంగాణ
ఇచ్చామని కొందరు
ఏలికలు,
అలా..
తెలంగాణ
అవిష్కరణ
జరిగి
గడచిపోయె
పుష్కర కాలం
అయితే..
నిజంగా పోరును
భుజాలపై మోసిందెవరు.
నేడు భుజకీర్తులు ధరించి
ఊరెగుతున్నదెవరు
ఇప్పుడు
ఎండుతున్న కడుపులు ఎవరి
నిండుతున్న కడుపులు ఎవరి
ఈతి బాధలెవరివి
రాజ భోగాలెవరి
పుష్కర కాలంలో
చాలా అభివృద్ధి
సాధించామా?
అలా సాధిస్తే
ఆరు గ్యారెంటీలా
పథాకాలు అవసరమా?
*ప్రపంచ సుందరి పోటి*
ఎందరో
సుందరీమణులు,
కారు వారు
120 దేశాల రాణులు,
అయినను
విచ్చేసిరి మన పట్టణములు
రకరకాల దేహపు రంగులు
శరీర ఆకృతులు,
సంప్రదాయాలు
భిన్న సంస్కృతులు,
చేసిరి మన బుద్ధవనంలో ధ్యానం
చౌమహల్ల భవనంలో భోజనం
చార్మినర్, లాడ్ బజార్లో గమనం
అలా..
అందమైన వనితలు
అందాల పోటిలో
విజయం వరించాలని
ప్రపంచ సుందరి మకుటం
ధరించాలని
విచ్చేసిరి భాగ్యనగరం.
ఈ అందగత్తల
బ్రతుకులలో
ఎన్ని వెతలో
ఎన్నెన్ని కథలో
ఇది కేవలం
(This is not a skin show,
but skill show too)
దేహా ప్రదర్శన కాదాట
యెన్నో పరీక్షలలో నెగ్గుతూ
ఆయా దేశలా సంస్కృతి,
సంప్రదాయాలు తెలిపె ఆటట
అందంతో అందలం
ఎక్కాలని కాకుండా
ఆత్మవిశ్వాసమే అభరణంగా
ప్రతిభే ప్రధానంగా
నిజాయితీ ఆయుధంగా
beauty with purpose
అనె నినాదంతో
పోటిని గెలిచెదరట
గెలిచిన వారికి
ఉచిత విమానయానాలు
నక్షత్ర గృహాలలో వసతులు
గొప్ప గొప్ప బహుమతులు,
ఉన్నతమైన పదవులు
ఆకాశమంత అవకాశములు
అయితే ఈ వసతులు కొరకు కాక
గెలిచిన వారు
ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ
మానవతావాద కార్యకలాపాలు,
ఆధునిక విలువలు, పెంచెదరట
కొందరు దివ్యాంగుల,
FMG (Female genital mutilation)
బాధితుల సమస్యలపై
పోరాడెదరట,
అలాగే యుద్ధాలు కూడ
ఆపగలిగితే ఎంతబాగుండునో.
పాడుతా తీయగా లాగ
ఇక్కడ కూడా
పోటికి ముందే విజేతలు
నిర్ణయింపబడతారేమో
తెలియదు మరి
ఎందుకంటే ఏ Event కైనా
talent ముఖ్యం కాదు
wallet నిండడమే
ముఖ్యం
ఇక ఎవరు గెలుస్తారనేది
పక్కన బెడితే
జగతి ఉద్దరణ కోసం
పోటిలో నిలిచిన
ప్రతి ఒక్కరు
గెలిచినట్లే
అయితే మగవాడిగా
నాదొ బాధ
ఏమిటంతే
Miss world పోటి వచ్చిన గుర్తింపు
Mr world పోటి రావడం లేదు
Comments
Post a Comment