నా కంద పద్యాలు

ఈ క్రింది వాక్యాలకు పూరణ చేసితిని
సమస్య : "వసంత శోభ" వాడి వ్రాసిన కందపద్యాలు
-------------------------------------------------
 
కం|| పడుచుల నామములందున్
కడు ఇంపగునవి, బిరబిర గడగడ వడిగా
తడబడ కుండ తెలుపుడని ...
అడిగినచొ "వసంత, శోభ"లని తెలుపనే! 

 
కం|| వలచి, మనువాడి, పువ్వులు
నలిగిన య "వసంత, శోభ"నపు రేయిని నా
తలపులలో పదిలంగా
నిలిపితిని, సదా మదిలొనె నెమరే సితినే!
---------------------------------------------------------
సమస్యలు
కం.|| పలువురు తండ్రుల తనయడు భక్తితొ మ్రొక్కెన్!
--------------------------------------------------------------
కం|| కిలకిల నవ్వుచు గలగల
పలుకుచు పెద చిన్ననాన్న బాహువులందున్
చెలువములు మీర పెరిగిన
పలువురి తండ్రుల తనయుడు భక్తితో మ్రొక్కెన్



కం|| బలరాముని సోదరి వల
పుల తనయుడు వలచి నిలచి వుత్తర మదిలో
కల పెళ్ళికళగ మారగ
పలువురి తండ్రుల తనయుడు భక్తితో మ్రొక్కెన్
---------------------------------------------------
సమస్య
" కం|| మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో!! "
------------------------------------------...
కం|| తగదని చెప్పిన వదలక
సొగసరి నీవనుచు తనను చెంతకు పిలవన్
పగలగ చెంపది సోదరి
మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో




కం|| జగడములాడ సరసముగ
సిగలో పూదండ కదలి సొగసుగ ఒడిలో
తెగిపడిన మల్లె పూలతొ
మగనిని కొట్టిన మగువయె మంచిది ఇలలో
-----------------------------------------------------
కం||కారమె యనిపించె తీపి కలకండవలే
-------------------------------------------

కం|| కారముల యందు మేలగు
కారము నేదగునని యడుగ, భువిన మరియే
కారము లేదనుచున్ ఓం
కారమె యనిపించె తీపి కలకండవలే
 

కం|| గౌరవ మర్యాదలు బం
గారము భారీ ధనమును, కారులు, పురిలో
పేరును, తెచ్చెడు నవ అధి
కారమె యనిపించె తీపి కలకండవలే
      

కం|| చోరుడు వాడని తెలిసియు
ఘోరములు సలిపెనని విని కూడా వైద్యం
పేరున సలిపినటుల నుప
కారమె యనిపించె తీపి కలకండవలే
  
కం|| చేరికగ దరికిన్ చేరియు
ధీరుడిగ తిరుగుచు కోర్కె తీర్చుచు మదిలో
చేరి వలపు నొసగిన మమ
కారమె యనిపించె తీపి కలకండవలే
-------------------------------------------
సమస్య
" కం.|| కారుల తిరిగేటి కుర్రకారులు వీరే! ! "
------------------------------------------
కం|| ఓరిమిగ రేయిపగలును ...
తీరుగ చదవగ సివిల్సు ధీరుల వోలెన్
పేరులు మొదట నిలవ అధి
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే



కం|| భారంగ బ్రతుకును తలచి
నేరం పాలకు లనబడు నేతల దనుచున్
చేరి అడవులను విప్లవ
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే








కం|| బారెడు జుట్టును నిక్కరు
మూరడు కల్లరు టిషర్టు బూటులు నైకీ
తీరుగ ధరించి జోరుగ
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే








కం|| కోరికగ సాప్టు వేరున
చేరియు డాలరులు కోరి చేరి అమెరికా
భారీగ గడించిగ షౌ
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే








కం|| గారాభము చేయటచే
గౌరవముగ ఎదుగలేక కౌరవులవలే
దారుణములు చేయుచు బే
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే








కం|| స్టారుకు అభిమానియనుచు
ఊరునపడి రేయిపగలు ఊరశునకమై
వూరక గొడవలుచేసి బి
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే








కం|| తారలమించిన పిల్లకు
దోరగ చూపులు విసరగ దొరయని తలచీ
దారికి వచ్చి వలచిన షి
కారుల తిరిగేటి కుర్ర కారులు వీరే
-----------------------------------------------------
కం|| పరమశివ తనయ విఘ్నే
శ్వర వేడెద మిమ్ము తలచి శరణం తండ్రీ
నిరతం మము కరుణించుం
పరమదయాళా గణేశ పావన మూర్తీ
...
కం|| పదవుల సరియగు తెలివియు
పెదవులు పలికెడు పలుకుకు విజ్ఞత నియవే
చదువుల రాణీ వాణీ
పదముల పడి కొలిచెద నిను పరి పరి మాతా






కం|| శంకరి శశిశేఖరి ప్రళ
యంకరి పరమేశ్వరి అభయంకరి గౌరీ
సుందరి శివాని రంజని
మంగళకారిణి భవాని మాతా కాళీ






కం|| హరహర శివశివ శంకర
కరిచర్మాంబరధర దయకర హర సర్వే
శ్వర శుభకర భయహర భవ
హర గంగాధర ప్రియకర హరశివ శంభో
----------------------------------------------------------------
కం || పరులకు కనబడని వేళ పాడ్యమి అయ్యెన్
-----------------------------------------------------------------
కం|| కురులను చూడగ మదిలో
మరులు గొలిపె, పలుకులు విన మధువులు ఝరులై
కురిసె, పడతి నీవును, చూ
పరులకు కనబడని వేళ పాడ్యమి అయ్యెన్
------------------------------------------------------------
 కం || కందము రచియించు వాడె కవియగును భువిన్
------------------ -----------------------------------------
కం||సుందర భావము కలిగియు
చందముగను అందముగను చంధస్సులతో
డెందము నానంద పరచు
కందము రచియించు వాడె కవియగును భువిన్






కం||కుందనపు బొమ్మ జిలుగులు
చందన పూరిత సుగంధ చందము కూడిన్
విందుల పసందు చేసెడు
కందము రచియించు వాడె కవియగును భువిన్
 
కం||నందనవనమున పడతులు
చిందులు వేయుచును హాయి చిందిచు వోలెన్
డెందమునానంద పరచు
కందము రచియించు వాడె కవియగును భువిన్
--------------------------------------------------------------------------

Comments

Popular posts from this blog